Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 44

Ganga is called Bhagirathi !!


సగత్వా సాగరం రాజా గంగయాsనుగతస్తదా |
ప్రవివేశ తలం భూమేః యత్ర తే భస్మసాత్ కృతాః ||

తా|| ఆ భగీరథుడు గంగ అనుసరించుచుండగా భూతలములో ఎక్కడ భస్మము చేయబడిరో అచటికి ప్రవేశించెను.

బాలకాండ
నలుబది నాలుగవ సర్గము
( భగీరథుడు సగరపుత్రులకు పుణ్యలోకములను ప్రాప్తింపచేయుట)

విశ్వామిత్రుడు మరల చెప్పసాగెను.

' ఓ రామా ! ఆ భగీరథుడు గంగ అనుసరించుచుండగా భూతలములో ఎక్కడ భస్మము చేయబడిరో అచటికి ప్రవేశించెను. ఎప్పుడు ఆ భస్మములు గంగా జలములచే ముంచ బడినవో అప్పుడు సర్వలోకములకు ప్రభువు అయిన బ్రహ్మ భగీరథునితో ఇట్లనెను. "ఓ నరశార్దూల ! మహాత్ముడైన సగరుని అరవై వేల పుత్రులు తరించి దేవులవలె స్వర్గమునకు చేరిరి. ఓ పార్థివ ! ఈ లోకములో సాగర జలమున్నంతవరకూ సగరాత్మజులు దేవతలవలె వర్గములోనే వుందురు. ఈ గంగ నీ పెద్దకూతురు అగును . ఇప్పుడు నీ చే చేయబడిన కార్యమువలన గంగ లోకములలో భాగీరథీ అనబడు పేరుతో ప్రసిద్దిపొందును. ఓ రాజన్ ! మూడు లోకములలో ప్రవహించుటవలన త్రిపథగా అని స్మరించబడును. ఓ రాజా! నీ పితామహులందరికి తర్పణములు విడువుము. రాజా చేసిన ప్రతిజ్ఞ నిలుపుకొనుము "

"ఓ రాజా ! ఏంతో యశస్సు గల నీ పూర్వీకులు ఈ మనొరథమును సాధింపలేక పోయిరి. నాయనా ! అదేవిధముగా లోకములో అతి తేజస్సుగల అంశుమంతుడు గూడా "గంగను ప్రార్థించి తీసుకువత్తును" అన్న మాట నిలుపుకొనలేకపోయెను. రాజర్షి , గుణములలో మహర్షితో సమానమైన తేజస్సు గల వాడూ , తపస్సులోనూ క్షత్ర ధర్మములోనూ నాతో సమానమైన మహాభాగుడూ అత్యంత తేజస్సు గల దిలీపుడు గూడా గంగను తీసుకు వచ్చుటకు ప్రార్థన చేసెను. కాని కృతకృత్యుడుగాక మరల విరమించుకొనెను".

" నీ చేత ఆ ప్రతిజ్ఞ నెరవేర్చబడినది. ముల్లోకములలో నీవు గొప్ప యశస్సును పొందెదవు. ఓ అరిసూదనా ! గంగావతరణము చేసి నీవు ధర్మమును ఆచరించి గొప్ప ప్రతిష్ఠను పొందితివి . ఓ నరోత్తమా ! నీవు పవిత్ర జలములలో స్నానమొనరించి పుణ్యఫలము పొందుము. పితామహులందరికీ తర్పణములు విడువుము . నీకు శుభమగుగాక. నేను నా లోకమునకు పోయెదను. ఓ నృపా నీవును వెళ్ళవచ్చును"

'అని ఈ విధముగా చెప్పి మహా యశోవంతుడు పితాముహుడు ఆయిన బ్రహ్మ వచ్చిన విధముగనే దేవలోకమునకు వెళ్ళెన".

' రాజర్షి మహయశోవంతుడైన భగీరథుడు కూడా యథా విథిగా సగరపుత్రులందరికీ తర్పణములు విడిచెను. తర్పణములిచ్చి శుచి అయి తన పురమును ప్రవేశించెను. ఓ రఘుశ్రేష్ఠా ! సమృద్ధమైన సంపదలతో తన రాజ్యమును పరిపాలించెను. ఓ రాఘవ | ఆ రాజు పరి పాలనలో లోకులు శోకములేనివారై , సంతాములు లేకుండా సమృద్ధమైన సంపదలతో వర్ధిల్లిరి. ఓ రామా ! ఈ విధముగా నీకు గంగావరణము గురించి విస్తరముగా చెప్పితిని ! నీకు శుభము ప్రాప్తించును. నీకు భద్రమగుగాక. ఇప్పుడు సంధ్యాకాలము సమీపుంచుచున్నది.'

'ఈ గంగావతరణ కథను ఎవరు విప్రులకు క్షత్రియులకు తదితరులకు వినిపించెదరో వారు ధన్యులగుదురు. యశస్సు ఆయుస్సు పుత్రలాభము స్వర్గమును పొందుదురు. వారు పిత్రుదేవతలను దేవతలను ప్రసన్నులుగా చేతురు. ఓ కాకుస్థ ! ఎవరైతే ఈ కథ వినురో వారి కోరికలన్నీ తీరును.వారి పాపములు నశించును. వారి ఆయువు కీర్తి ఇనుమడించును'.

||ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలుబది నాలుగవ సర్గ సమాప్తము. ||
|| ఓమ్ తత్ సత్ ||